బాధాకరమైన బైపాస్ సర్జరీలకు కాలం చెల్లింది హార్ట్ సర్జరీకోసం ఇపుడు పక్కటెముకలు కోయనక్కరలేదు

ప్రశ్న: నా వయస్సు 48 సం.లు. ఈ మధ్య ఓ రోజు ఛాతీలో ఏడమవైపు నొప్పి వచ్చి ఎడమచేయి లాగినట్లు అని పించగా అనుమానంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లాను. పరీక్షలు చేసి గుండెకు రక్తం సరఫరాచేసే రక్తనాళాలు రెండు బ్లాక్ అయినట్లు చెప్పి బైపాస్ సర్జరీ చేయించుకోమని సిఫార్సు చేశారు. ఇది పెద్ద ఆపరేషన్ అని, ఇందుకోసం చాతి ఎముకలు కోస్తారని విన్నాను. నిజమేనా ? మరో మార్గం ఏమీ ఉండదా? దయచేసి తెలపండి.
సి. సన్యాసవల్లి, శృంగవరపుకోట, విజయనగరం జిల్లా
జవాబు: శరీరభాగాలన్నింటికీ రక్తం పంప్ చేసే గుండె అతిముఖ్యమైన అవయవం. నాలుగుగదులతో నిరంతరం పనిచేస్తుండే సజీవ పంపింగ్ మిషను.గుండెకూ నిరంతర శుద్ధరక్తం అవసరం. ఆ విధంగా ఆక్సీజన్ కలిగిన రక్తాన్ని అందించే ధమనులలో ఏర్పడే ఆటంకం కరొనరి ఆర్టరీ డిసీజ్ కు దారితీస్తుంది. కరొనరి ధమనులలో కొవ్వుఅణువులతో ఏర్పడిన పూడిక కారణంగా గుండెకండరాలు ఆక్సీజన్‌తో కూడిన శుద్ధరక్తం అందక చచ్చుబడిపోతాయి. అనేక సందర్భాలలో ఎటువంటి రోగలక్షణాలు ప్రదర్శించకుండా నెమ్మదిగా విషమించి హఠాత్తుగా దెబ్బదీసే వ్యాధి ఇది. తీవ్ర శ్రమతో కూడిన పనుల్లో నిమగ్నమైనపుడు లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు గుండెకు తగినంత రక్తం అందక వ్యాధి బయటపడుతుంది.
ఈ రుగ్మత చికిత్సకు శస్త్రచికిత్స అవసరం అవుతుంది. కార్డియో వాస్క్యులార్ సర్జరీలుగా పేర్కొనే ఈ శస్త్రచికిత్సలను ఇదివరకు పెద్ద కోతతో చాతి భాగాన్ని తెరచి చేస్తూ వచ్చారు. అయితే ఈ సంప్రదాయ ఓపెన్ హార్ట్ సర్జరీకి ఆధునికం, ప్రభావవంతమైన ప్రత్యామ్నాయంగా మినిమల్లీ ఇన్వేసివ్ హార్ట్ సర్జరీని అభివృద్ది చేశారు. దీనిలో చాతిపైన చిన్న కోతపెట్టినా పక్కటెముకలను కత్తిరంచటం లాంటిది ఉండదు. పక్కటెముకల మధ్య స్థలంలో గాటు నుంచే శస్త్రచికిత్స చేస్తారు. కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ఠింగ్(సి.ఎ.బి.జి.) అని కూడా పేరున్న మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ సురక్షితమైనది, ప్రభావవంతమైనది. దీనిలో రక్తప్రసరణకు అడ్డంకి (బ్లాక్) ఏర్పడిన ధమనికి ప్రత్యామ్నాయంగా మరో రక్తనాళాన్ని అతికించి(బైపాస్ చేసి) గుండెకు నిరాటంకంగా రక్తసరఫరా జరిగే ఏర్పాటుచేస్తారు. కొత్తగా అతికించిన రక్తనాళం(బైపాస్ ఆర్టరీ) ద్వారా గుండె కండరాలకు ఆక్సీజన్, పోషకాలతో కూడిన రక్తం అందుతుంది. ఓపెన్ హార్ట్ పద్దతిన చేసినా, మినిమల్లీ ఇన్వేసివ్ పద్దతిన చేసినా వ్యాధిగ్రస్థులకు సమానమైన ఫలితాలు అందుతాయి. కానీ ఆ సంప్రదాయ బైపాస్ సర్జరీతో పోలిస్తే మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ ఆధునికమైనది. మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలో నొప్పి తక్కువగా ఉండటమే కాకుండా వ్యాధిగ్రస్తులు వేగంగా కోలుకొంటారు.
మీరు ఆందోళన చెందుతున్నట్లు చాతిపైన పెద్ద కోతలు, పక్కటెముకలను కోయటం అవసరం లేకుండానే మినిమల్లీ ఇన్వేసివ్ పద్దతిన కరోనరి ఆర్టరీ బైపాస్ చేయటం ద్వారా పరిస్థితిని సరిదిద్దటానికి వీలవుతుంది. అందువల్ల ఆలస్యం చేయకుండా ఈ శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్న ఆస్పత్రిలోచేరి బైపాస్ చేయించుకొండి.
వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీ క్లిష్టమైనదే కానీ… నిపుణులు పూనుకుంటే ఖచ్చితమైన ఉపశమనం ఇస్తుంది.
ప్రశ్న: నా వయస్సు 35. నెల రోజుల క్రితం హఠాత్తుగా స్పృహతప్పటంతో ఆస్పత్రిలో చేరాను. పరీక్షల అనంతరం వాల్వ్ లార్ డిసీజ్ అని చెప్పారు. నా గుండె కవాటాలకు సంబంధించిన సమస్య పరిష్కారానికి గాను వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. వాల్వ్ లార్ డిసీజ్ అంటే ఏమిటి. వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీ సురక్షితమైనదేనా దయచేసి తెలియజేయండి.
కె.వెంగళరెడ్డి. కమలాపురం, కడపజిల్లా.
జవాబు: ఇది జన్మతః వచ్చిన వాటితో సహా పలు లోటుపాట్ల కారణంగా వాల్వ్ లార్ డిసీజ్ వ్యాధి వస్తుంది. రుమాటిక్ హార్ట్ డిసీజ్, రుమాటిక్ ఫివర్, కంజనటోల్ డిఫెక్ట్స్ వంటివి గుండె కవాటాల వ్యాధికి కారణం అవుతున్నట్లు గుర్తించారు. గుండె కవటాలు సరిగా తెరచుకోకపోవటం, మూతపడకపోవటం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిస్థితిలో శరీర అవసరాల మేరకు రక్తాన్ని పంప్ చేయటానికి గుండె మరింత శ్రమపడి పనిచేయాల్సి వస్తుంది. ఇది చివరకు గుండె కండరాలు దెబ్బదినటానికి కారణం అవుతుంది. దీంతో గుండె విఫలం అవటం, వ్యక్తి హఠాత్తుగా స్పృహతప్పటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
వాల్వ్ లార్ డిసీజ్ వల్ల ఏర్పడిన సమస్యలను పరిష్కరించేందుకు రోగగ్రస్థమైన గుండె కవాటాన్ని తీసివేసి ఆ ప్రదేశంలో ఆరోగ్యకరమైన మరో కవాటాన్ని లేదా కృత్రిమ కవాటాన్ని అమరుస్తారు. ఈ పద్దతినే ఆర్టిఫిషియల్ వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీ అని కూడా అంటారు. చాలా సందర్భాలలో ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారానే ఈ కవాటం మార్పిడి చేస్తారు. అంటే ఛాతీని తెరచి గుండెలో మార్చవలసిన కవటాన్ని తీసివేసి కొత్త దానిని ఆ స్థానంలో అమర్చి కుట్లువేస్తారు. అనేక సంవత్సరాలుగా అమల్లో ఉన్న ఈ ఓపెన్ హార్ట్ సర్జరీలో గుండె పనిచేయటాన్ని నిలిపివేసి చేయాల్సి ఉంటుంది. చాతి పైన పెద్ద కోత పెట్టడం, పక్కటెముకలను కత్తిరించాల్సి ఉంటుంది. పైగా ఇది ఖరీదైనది కూడా.
దీనిలోని పరిమితులను అధిగమించి చాతిని తెరవకుండానే మినిమల్లీ ఇన్వేసివ్ హార్ట్ సర్జరీ ద్వారా చాతి కుడివైపు చిన్న రంధ్రం చేసి గుండెకవాటాన్ని మార్చే శస్త్రచికిత్సా విధానం అభివృద్ధి చెందింది. ఓపెన్ హార్ట్ సర్జరీతో పోలిస్తే దీనికి అయ్యే ఖర్చు దాదాపు ఇరవై అయిదు శాతం తక్కువ. గుండె ఆపరేషన్లలో ప్రధానమైన సవాలు కొట్టుకుంటూ ఉన్న గుండెకు శస్త్రచికిత్స చేయటం. ఆపరేషన్ చేయవలసిన భాగాన్ని స్థిరంగా ఉంచే మెళకువలు దీనిలో అభివృద్ధి చెందాయి. మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ గుండె స్పందిస్తుండగానే చేసే శస్త్రచికిత్స. హార్ట్ లంగ్ మిషనును ఉపయోగించరు. ప్రతీ మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ విజయవంతం అవటం అన్నది సర్జన్ ప్రావీణ్యత, నైపుణ్యం పైన, సహాయ సిబ్బంది అనుభవం పైన ఆధారపడి ఉంటుంది.
గుండె వ్యాధులకు సంబంధించి శస్త్రచికిత్సల విషయంలో అంతర్జాతీయ స్థాయిలో జరిగే పరిశోధనలు, పరిణామాల ఫలితాలు అతి కొద్ది సమయంలోనే రాష్ట్రంలో అందుబాటులోకి వస్తున్నాయి. అయితే మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ క్లిష్టమైన, కీలకమైన సర్జరీ. ఇదివరకే ఈ సర్జరీలు నిర్వహించి అత్యాధునిక వైద్యవసతులు, అనుభవజ్ణులైన వైద్యనిపుణులు అందుబాటులో ఉన్న ఆస్పత్రిని ఎంపికచేసుకోవాలి. సురక్షితంగా, విజయవంతంగా ఆపరేషన్ పూర్తిచేయటంలో నిపుణులైన హార్ట్ సర్జన్లు- ఎటువంటి అత్యవసర పరిస్థతినైనా ఎదుర్కొనే అత్యాధునిక వైద్యవసతులకు సమానమైన ప్రాధన్యత ఉంటుంది. ఇలాంటి అత్యున్నత స్థాయి ఏర్పాట్లు ఉండి ఆస్పత్రిలో మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ చేయించుకోవటం వల్ల శస్త్రచికిత్స ద్వారా సత్ఫలితాలు పొందేందుకు వీలుకలుగుతుంది.
మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీతో గుండె ఆపరేషన్లు సురక్షితం,వేగవంతం
ప్రశ్న: నా వయస్సు 45. నెల రోజుల క్రితం తీవ్రమైన గుండె నొప్పితో ఆస్పత్రి వెళ్లాను. గుండెకు సంబంధించిన రక్తనాళాలలో బ్లాక్ ఏర్పడినట్లు డాక్టర్లు గుర్తించారు. కరోనరి ఆర్టరీ బైపాస్ సర్జరీ సిపార్సుచేశారు. హైదరాబాదుకు వెళ్లి మినిమల్లీ ఇన్వేసివ్ పద్దతిన చేయించుకోవలిసిందని మా ఫామిలీ డాక్టర్ చెప్పారు. ఈ మినిమల్లీ ఇన్వేసివ్ హార్ట్ సర్జరీ అంటే ఏమిటి? ఇది సురక్షికమైనదేనా? దీనివల్ల ప్రత్యేక ప్రయోజనం ఏమిటి? దయచేసి వివరంగా తెలపండి.
జవాబు: ఇటీవలి కాలంలో గుండె వ్యాధుల చికిత్సకు సంబంధించిన శస్త్రచికిత్సను అపూర్వంగా ఆధునికీకరించిన, వేగవంతం చేసిన పద్దతి మినిమల్లీ ఇన్వేసివ్ హార్ట్ సర్జరీ. దీనిలో చాతి పైన కుడిభాగంలో చిన్న కోతపెట్టడం ద్వారా హార్ట్ సర్జన్ శస్త్రచికిత్సను చేస్తారు. పెద్ద కోతతో చాతి భాగాన్ని తెరచి చేస్తూ వచ్చిన సంప్రదాయ ఓపెన్ హార్ట్ సర్జరీకి ఇది ఆధునికం, ప్రభావవంతమైన ప్రత్యామ్నాయం.ఈ సర్జరీని సాధారణంగా సిఫార్సు చేసే రుగ్మతల్లో కరోనరి ఆర్టరీ బైపాస్ ఒకటి. కార్డియో వాస్క్యులార్ సర్జరీలుగా పేర్కొనే పలు శస్త్రచికిత్సలు వయస్సుతో నిమిత్తం లేకుండా పిల్లలు, పెద్దలు ఎవరికైనా చేయాల్సి రావచ్చు. ఈ శస్త్రచికిత్సల నిర్వహణకు మినిమల్లీ ఇన్వేసివ్ హార్ట్ సర్జరీ ఉపయోగపడుతుంది. అత్యంత అనుభవజ్ఞులు, నిపుణులయిన సర్జన్లు చేసే ఈ శస్త్రచికిత్సలో నొప్పిని తగ్గించి త్వరగా సాధారణ స్థితికి వచ్చేందుకు తోడ్పడే సర్జరీ ఇది.
మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ (ఎం.ఐ.సి.ఎస్.) లేదా మినిమల్లీ ఇన్వేసివ్ హార్ట్ బైపాస్ సర్జరీ సంప్రదాయ ఓపెన్ హార్ట్ సర్జరీని పక్కకునెట్టి ఎక్కువమంది ఎంపికపొందుతున్నది. ఓపెన్ హార్ట్ సర్జరీలో చాతికుడి వైపు పక్కటెముకను కోసివేసి(స్టెర్నోటమీ) చాతిపైన ఎనిమిది నుంచి పది అంగుళాల మేరకు కోతపెట్టాల్సి వస్తుండగా మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీలో అసలు పక్కటెముకను కోయనే కోయరు. పక్కటెముకల మధ్య స్థలంలో మూడు నుంచి నాలుగు అంగుళాల మేరకు మాత్రమే కోత పరిమితం అవుతుంది. సర్జన్ తక్కువకోతతో, స్పందిస్తున్న గుండె పైన మరింత స్పష్టమైన పరిస్థితిలో, సమర్థంగా శస్త్రచికిత్స చేయగలుగుతారు.
మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ పేషంట్లు సంప్రదాయ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకునే వారికంటే త్వరగా ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లగలుగుతారు. స్టెర్నోటమీ చేయించుకున్న వారు శస్త్రచికిత్స తరువాత అయిదు – పది రోజుల వరకూ ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుంది. మినిమల్లీ ఇన్వేసివ్ పద్దతిన సర్జరీ చేయించుకున్న పేషంట్లు రెండు-మూడు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిస్చార్జ్ అయి వెళ్లటానికి వీలవుతుంది.చిన్న గాటుతో సర్జరీ చేయటానికి వీలవుతుంది. దీంతో మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియక్ సర్జరీ తరువాత సంక్రమణ వ్యాధులు సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది.
About Author –
Dr. Kale Satya Sridhar, Consultant Cardiothoracic Surgeon, Yashoda Hospitals, Hyderabad
MBBS, M.S.(General Surgery), M.Ch (Cardiovascular Surgery)
Dr. Kale Satya Sridhar is an experienced cardiac surgeon with expertise in mitral valve repairs, aortic surgery, minimally invasive surgery, and surgery for heart failure. He has performed over 1000 cardiac and thoracic surgeries, in both adults and children and over 200 open heart surgeries.